హిస్టరీ

మధుర నాయకులు.
దక్షిణ భారతదేశాన్ని పాలించిన రాజ్యాల్లో మధరనాయక రాజ్యం ఒకటి. ఇది విజయనగర రాజ్యానికి సామంత రాజ్యంగా ఉండేది. ఈ రాజ్యంలో మధుర, తిరునల్వేలి, తిరుచునాపల్లి కోయంబత్తూరు, సేలం మొదలైన ప్రాంతాలు ఉండేవి. మధురనాయక రాజ్యాన్ని విశ్వనాథనాయకుడు క్రీ.శ. 16వ శతాబ్దం లో పాలించాడు. కృష్ణదేవరాయల అనంతరం క్రమంగా విజయ నగర సామ్రాజ్యంలో తలెత్తిన రాజకీయ అనిశ్చిత పరిస్థితుల్లో మధురనాయక రాజ్యం స్వతంత్ర రాజ్యంగా అవతరించిందని చరిత్రకారుల అభిప్రాయం.
విశ్వనాథనాయకుని తర్వాత అతని కుమారుడు కృష్ణప్పనాయకుడు పాలించాడు. క్రీ.శ 1602-1609 వరకు ముద్దు కృష్ణప్ప, 1609 నుంచి 23 వరకు ముద్దు వీరప్ప పరిపాలించారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ముద్దు వీరప్ప కుమారుడు తిరుమల నాయకుడు మంచి పాలకుడిగా పేరు తెచ్చుకున్నాడు. ఆయన తిరుమలరాయ మహల్‌ని నిర్మించి, తెలుగు భాషని, సాహిత్యాన్ని ప్రోత్సహించాడు. తిరుమల నాయకుడి కుమారుడు చొక్కనాథుని కాలంలో నాయక రాజ్య పతనం ప్రారంభమయ్యింది. ఆ తర్వాత వచ్చిన విజయరంగ చొక్కనాయకుడు చిన్నపిల్లవాడు కావడంతో అతని అమ్మమ్మ రాణి మంగమ్మాళ్ రాజ్యపాలన చేసింది. విజయరంగ చొక్కనాథుడు యుక్తవయసుకు వచ్చిన తర్వాత పాలన బాధ్యతలను చేపట్టాడు. అతడి తర్వాత అతని భార్య రాణి మీనాక్షి రాజ్యాధికారాన్ని చేపట్టింది. స్ర్తీల అధికారాన్ని భరించలేని ఆ రాజ్యంలోని కొందరు ఆమెపై కుట్ర పన్నారు. దాంతో ఆర్కాట్ పాలకుడు చాంద్ సాహెబ్ మధురపై దండెత్తి, ఆర్కాట్ రాజ్యంలో కలుపుకున్నాడు. లొంగిపోవటం ఇష్టం లేని మీనాక్షి ఆత్మత్యాగం చేసుకుంది.

భారతదేశ నదులు.
భారతదేశంలోని నదులను హిమాలయ నదులు, దక్కన్ నదులు అని రెండు రకాలుగా విభజించారు. మనదేశంలో ముఖ్యంగా మూడు ప్రాంతాలు నదుల జన్మస్థానాలు - హిమాలయాలు, వింధ్యసాత్పుర పర్వతాలు, పడమటి కనుమలు. భూగర్భ శాస్తవ్రేత్తల అభిప్రాయం ప్రకారం దక్కన్ నదులు హిమాలయ నదుల కన్నా ప్రాచీనమైనవి. దక్కన్ నదులు చాలావరకు రుతువుల మీద ఆధారపడి ఉంటాయి. హిమాలయ నదులు వర్షాల వలన, వేసవిలో మంచు కరగటం వలన సంవత్సరం పొడవునా ప్రవహిస్తూ ఉంటాయి. అందుకే వీటిని శాశ్వత నదులు అంటారు. హిమాలయ నదులు దేశంలోని మొత్తం నీటిలో 70 శాతం నీటిని సముద్రంలోకి చేరవేస్తాయి. దక్కన్ నదులు 30 శాతం నీటిని చేరవేస్తాయి.
హిమాలయ నదుల్లోని సింధునది వలనే మన దేశానికి హిందూదేశం అని పేరు వచ్చింది. సింధునది టిబెట్‌లోని మానస సరోవర్ దగ్గర కైలాస శిఖరంలో పుట్టి హిమాలయాల మీదుగా పాకిస్థాన్ గుండా ప్రవహించి కరాచీ దగ్గర అరేబియా సముద్రంలో కలుస్తుంది. గంగానది హిమాలయాల్లోని గంగోత్రి దగ్గర పుట్టి ఉత్తరప్రదేశ్, బీహర్, బెంగాల్ రాష్ట్రాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది.
బ్రహ్మపుత్ర నది మానస సరోవర్‌లో జన్మించి టిబెట్, అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, బంగ్లాదేశ్ గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తుంది. దక్కన్ నదుల్లో మహానది, గోదావరి, కృష్ణ, కావేరి, పెన్న... లాంటి నదులు తూర్పు వైపుకు ప్రవహిస్తాయి. నర్మద, తపతి, శరావతి, నేత్రావతి నదులు పశ్చిమదిక్కుగా ప్రవహిస్తాయి. తూర్పు వైపుకు ప్రవహించే నదులు పడమటి కనుమల్లో పుట్టి దక్కన్ పీఠభూమికి అడ్డంగా, తీరమైదానాల గుండా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. పశ్చిమ వైపుకు ప్రవహించే నదులు అరేబియా సముద్రంలో కలుస్తాయి.

వైరస్ అంటే ఏమిటి?
జలుబు, జ్వరం వంటి రకరకాల బాధలకు కారణం వైరస్ అని వింటూ ఉంటాం. వైరస్ అంటే ఏమిటో చూద్దాం. మైక్రోస్కోప్‌తో పరిశీలిస్తే మాత్రమే కనిపించే అతి చిన్న కణం వంటి దానిని వైరస్ అంటారు. ఈ వైరస్ స్వతహాగా శక్తి ఉన్నది కాదు. జంతువులు, చెట్లు, మనుషులపై ఆధారపడి శక్తిని సంపాదించుకుంటుంది.
దాని శక్తి కోసం ఇతర జీవకణాల మీదకు దాడి చేస్తుంది.ఒకసారి ఒక కణంలోకి వైరస్ ప్రవేశిస్తే ఆ కణంలో మరి కొన్ని వైరస్‌లు పుట్టుకొస్తాయి. అవి కణంలోని గోడలను దెబ్బతీసి శరీరంలోని అన్ని కణాలకు వ్యాపిస్తాయి. అందుకే మనుషులకు, జంతువులకు అనారోగ్యం ఏర్పడుతుంది. మొక్కల్లో కూడా అనేక తెగుళ్ళు రావటానికి కారణం వైరస్. ఎయిడ్స్ లాంటి ప్రమాదకరమైన రోగాలు వైరస్‌ల వల్లే వస్తాయి.
ఆచార్య జె.బి. కృపలానీ
దేశ స్వాతంత్య్రం కోసం పోరాడిన యోధుల్లో ఆచార్య జె.బి. కృపలానీ ఒకరు. ఆయన గాంధేయవాది, సోషలిస్టు, పర్యావరణ వేత్త. ఆయన మహాత్మా గాంధీకి అత్యంత సన్నిహితుడు. సహాయ నిరాకరణ ఉద్యమం నుంచి ఎమర్జెన్సీ కాలం వరకు దేశ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న నేత. కృపలానీ నాటి సింధు (నేటి పాకిస్తాన్) ప్రాంతంలోని హైదరాబాద్‌లో 1888లో జన్మించారు. ఇతడి పూర్తిపేరు జీవిత్‌రాయ్ భగవాన్ దాస్ కృపలానీ. ఆయన కరాచీలోని డి.జె.సైన్స్ కాలేజీలో చదువుకునే రోజుల్లో... రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నందుకు ఆయనను కాలేజీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత ముంబై ఫెర్గూసన్ కాలేజీలో విద్యనభ్యసించి ఉపాధ్యాయుడిగా జీవితాన్ని ప్రారంభించాడు. గాంధీ దక్షిణాఫ్రికా నుంచి వచ్చి స్వాతంత్య్ర పోరాటంలోకి దిగటంతో కృపలానీ కూడా దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమాల్లో పాల్గొన్నాడు.
కృపలానీ సహాయ నిరాకరణ ఉద్యమంలో పాల్గొంటూనే గుజరాత్, మహారాష్ర్టలోని గాంధీ ఆశ్రమాలలో సంస్కరణ, విద్యా సంబంధ విషయాలపై కృషి చేశాడు. బ్రిటిష్ పాలకులకు వ్యతిరేకంగా జరిగే అనేక నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్నందుకు కృపలానీ అనేకసార్లు జైలుకు వెళ్లారు. కాంగ్రెస్ పార్టీలో ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాడు. క్లిష్టమైన సమయంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు.
ఈ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న పరిణామాల్లో ఆయన కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి మరికొందరు నేతలతో కలిసి ‘కిసాన్ మజ్దూర్ ప్రజాపార్టీ’ని స్థాపించారు. ఆ తర్వాత దానిని సోషలిస్టు పార్టీలో విలీనం చేసి ప్రజా సోషలిస్టు పార్టీ’గా పేరు మార్చారు. కృపలానీ జీవితాంతం నెహ్రూ, ఇందిరాగాంధీ పాలనా విధానాల విమర్శకునిగా మిగిలిపోయాడు. ఆయన భార్య సుచేతా కృపలానీ అంచెలంచెలుగా ఎదిగి కేంద్ర మంత్రివర్గంలో పదవులతో సహా అనేక ఉన్నత పదవులు పొందారు. కృపలానీ 1982 మార్చి 19న మరణించారు.
జాన్ కీట్స్
ఇంగ్లిష్ భావ కవుల్లో ప్రసిద్ధి చెందిన కవి జాన్ కీట్స్. షెల్లీ, బైరన్‌లతో పాటు కీట్స్ పేరు ప్రస్తావించకుండా ఇంగ్లిష్ భావ కవిత్వం గురించి మాట్లాడడం అసాధ్యం. ఆయనంత గొప్పగా ప్రకృతిని ప్రేమించి, ఆరాధించిన వారు చాలా తక్కువమందే ఉంటారంటే అతిశయోక్తి కాదు. ఆయన 1795 అక్టోబర్ 31న లండన్‌లో జన్మించాడు. థామస్ కీట్స్, ఫ్రాన్సిస్ జెన్నింగ్స్‌ల మొదటి సంతానం జాన్ కీట్స్.కీట్స్‌కి ఎనిమిదేళ్ల వయసున్నప్పుడు తండ్రి మరణించాడు. కీట్స్‌కి పద్నాలుగేళ్లు వచ్చేసరికి తల్లి క్షయ వ్యాధితో మరణించింది. దానితో కీట్స్ తన ఇద్దరు తమ్ముళ్లు, ఒక చెల్లెలితో సహా బంధువుల సంరక్షణలో ఉండవలసి వచ్చింది.
స్కూలు చదువు పూర్తయిన తర్వాత కీట్స్ ఒక సర్జన్ దగ్గర అప్రెంటిస్‌గా చేరాడు. అది పూర్తయిన తర్వాత కీట్స్ 1815 అక్టోబర్‌లో గైస్ హాస్పిటల్ (ఇది ప్రస్తుతం లండన్ కింగ్స్ కాలేజ్‌లో భాగం)లో వైద్య విద్యార్థిగా తన పేరు నమోదు చేసుకున్నాడు.
చేరిన నెలరోజుల్లోపే డ్రెసర్‌షిప్ హోదాకి అంటే జూనియర్ హౌస్‌సర్జన్‌తో సమానమైన స్థాయికి చేరాడు. కొంతకాలం ఆస్పత్రులలో సర్జన్లకి సహాయకునిగా పనిచేశాడు. దానితో కీట్స్‌కి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తీరిపోతాయని అందరూ భావించారు. కానీ సాహిత్యం పట్ల మమకారం పెరగడంతో చేస్తున్న వృత్తిని వదిలి పెట్టి పూర్తిగా కవిత్వానికే అంకితమయ్యాడు.
కీట్స్ మొదటి కవిత ‘యాన్ ఇమిటేషన్ ఆఫ్ స్పెన్సర్’. దీనిని కీట్స్ 1814లో తన పందొమ్మిదవయేట రాశాడు. ‘ఓడ్ టు ఏ నైటింగేల్’, ఇసాబెల్లా, టు ఆటమ్న్, ‘లామియా’,‘ హైపరియాన్’,‘ ది ఈవ్ ఆఫ్ సెయింట్ ఆగ్నెస్’ లాంటి పుస్తకాలెన్నో రచించాడు.
అందరికీ సుపరిచితమైన ‘‘ఏ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ ఏ జాయ్ ఫరెవర్’’ అనే కొటేషన్ కీట్స్ రాసిన కవిత్వంలోనిదే. తన తల్లినీ, సోదరుడినీ కబళించిన క్షయ వ్యాధితో పోరాడి పోరాడి 1821 ఫిబ్రవరి 23న కీట్స్ చనిపోయాడు. కీట్స్ జీవితకాలం పాతికేళ్లే అయినప్పటికీ, వందేళ్లు గడిచినా మరిచిపోలేని అద్భుత కవిత్వాన్ని సృష్టించిన కవిగా చరిత్రలో నిలిచిపోయాడు.

నన్నె చోడుడు
నన్నెచోడుడు శైవకవుల్లో మొదటివాడు. రాజ కవి. ఆయన క్రీ.శ. 12వ శతాబ్దానికి... అంటే నన్నయ్య, తిక్కనల మధ్య కాలానికి చెందిన వాడు. నన్నెచోడుడు రచించిన కుమార సంభవం అనే కావ్యం బాగా ప్రసిద్ధి చెందింది. కుమార సంభవం నుంచి తెలుగు సాహిత్యంలో శైవ మత ప్రధానమైన రచనలు వ్యాప్తిలోకి వచ్చాయి. తెలుగు, సంస్కృత పదాలను మేళవించి ఉపయోగించిన తొలి కవి, తెలుగు సాహిత్యంలో కన్నడ, తమిళ పదాలను చేర్చిన వాడు ఇతడే. మార్గ-దేశి, జాను తెనుగు, వస్తు కవిత అనే పద ప్రయోగాలను చేశాడు.
నన్నెచోడుని కుమారసంభవం కాళిదాసు రాసిన కుమారసంభవానికి యథాతథ అనువాదం కాదు. కాళిదాసు రచనలోని ఇతివృత్తాన్ని మాత్రమే తీసుకున్నాడు. శివ, స్కాంద, వాయు, బ్రహ్మండ పురాణాల్లోనూ, భారత రామాయణాల్లోనూ సంగ్రహంగా ఉన్న వాటినే ప్రబంధంగా మలిచాడు. ఆయన కుమార సంభవంలో ‘దేశి-మార్గములను దేశీయములుగా చేయవలను’ అని పేర్కొన్నాడు. అందులోని గజానన వృత్తాంతం నన్నెచోడుని దేశీయ అభిమానాన్ని తెలియజేస్తుంది. ఆయన తన కావ్యం రత్నపుత్రిక వంటిదని కొనియాడాడు. అలాంటి కృతులు రచించటానికి కవికి అరవైనాలుగు విద్యల్లో నేర్పు ఉండటం అవసరమని ఆనాటి కవుల అభిప్రాయం. కవిత్వం సౌందర్యంగా, సుకుమారంగా, హృదయానికి నచ్చే విధంగా ఉండాలని నన్నెచోడుని అభిప్రాయం. ప్రతి పద్యం విశిష్టంగా ఉండాలని సూచించాడు. సుకవి స్తుతి, కుకవి నింద, ఇష్టదేవప్రార్థన ఇతడి ఇతర రచనలు.

అరవింద్‌ఘోష్
అరవింద్‌ఘోష్ జాతీయోద్యమ నాయకులలో ప్రముఖుడు. ఆయన స్వాతంత్ర సమరయోధుడే కాక, మంచి కవి, యోగి, తత్త్వవేత్త. ఆయన 1872 ఆగష్టు 15న కలకత్తాలో జన్మించాడు. అరవింద్ ఘోష్ అతివాది విభాగానికి చెందినవాడు. స్వామి వివేకానందుని ఆధునిక వేదాంత ఉద్య మం వల్ల ప్రభావితమై, హిందూమతంలోని తాంత్రిక భావాలను ఆధారం చేసుకుని బెంగాల్‌లో అతివాద జాతీయవాదం అభివృద్ధి చెందింది. అరవింద్‌ఘోష్ కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో అసాధారణ ప్రతిభావంతుడైన విద్యార్థిగా గుర్తింపు పొంది, సివిల్ సర్వీస్ (ఐసిఎస్) పరీక్షలో ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణుడయ్యాడు. ఐసిఎస్ పదవిని నిరాకరించి 1892లో భారత దేశానికి తిరిగి వచ్చాడు. సాహిత్య వ్యాసంగంలో నిమగ్నుడయ్యాడు. చాలా రచనలు చేశాడు. ‘న్యూ ల్యాంప్ ఫర్ ఓల్డ్’ అనే శీర్షికన ముంబైకి చెందిన ‘ఇందు ప్రకాశ్’ అనే పత్రికలో 1893 ఆగష్టు నుంచి 1894 మార్చి లోపల చాలా వ్యాసాలను ఘాటుగా రాశాడు. జాతీయత అనేది మతం. దాన్ని దైవం ఇచ్చింది. ఈ భావం హృదయానికి, ఆత్మకు సంబంధించినదని అరవింద ఘోష్ జాతీయతను నిర్వచించాడు.
1905లో బెంగాల్ విభజనానంతరం రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నాడు. బిపిన్‌చంద్రపాల్, తిలక్‌లకు ఈయన సన్నిహితుడై, కాంగ్రెస్‌లోని మితవాదులను సవాల్ చేశాడు. ‘వందేమాతరం’ పత్రిక నిర్వహణలో బిపిన్‌చంద్రపాల్‌తో సహకరించాడు. ‘బెంగాల్ యుగంతర్’ అనే పత్రికను ప్రారంభించాడు. 1906లో అరవిందఘోష్ కళాశాల అధ్యక్షుడయ్యాడు. బెంగాల్ జాతీయ కళాశాలను స్థాపించి, బిపిన్‌ చంద్రపాల్, తిలక్‌లతో కలిసి రాజ్యాంగ పద్ధతుల ద్వారా ఆందోళన కొనసాగించాడు. విదేశీ వస్తు బహిష్కరణ అమలు జరిపాడు. వీటన్నిటి ద్వారా దేశానికి స్వాతంత్య్రాన్ని సాధించవచ్చని సూచించాడు.
తీవ్రవాద జాతీయవాదాన్ని సమర్థించిన తత్వవేత్తలు, భారతదేశపు సర్వజ్ఞతను విశ్వసించారు. విదేశీ ప్రభుత్వ సంస్థల ప్రాబల్యం నుంచి, సంస్కృతీ ప్రభావం నుంచి స్వాతంత్య్రం సాధించిన తర్వాతే హిందూ సంస్కృతి శిఖరాగ్రాలను అందుకుందని వారు నమ్మారు. జాతీయతను మత పరిభాషలో ప్రకటించారు. అయితే జాతీయోద్యమ కార్యక్రమాన్ని దేశ ప్రజల లౌకిక ప్రయోజనాల కొరకు రూపొందించి ఉండాల్సిందని కొందరి భావన. అరవింద్‌ఘోష్‌‘ ద లైఫ్ డివైన్’, ‘సావిత్రి’లాంటి చక్కటి రచనలు చేశారు. ఆయన 1950 డిసెంబర్ 5న మరణించారు.
నది ఒడ్డున నీళ్లు వేగంగా ఎందుకు ప్రవహించవు?
నదిలోకి స్నానం చెయ్యడానికో, ఈత కొట్టడానికో వెళ్లినప్పుడు... నదిని పరిశీలిస్తే ఒక విషయాన్ని గమనించవచ్చు. నది మధ్యలో నీటివేగం ఎక్కువగా, ఒడ్డు దగ్గర మంద్రంగా ప్రవహించడాన్ని చూడవచ్చు. దీనికి కారణం ఏమిటంటే.. నీరు అతి పలుచని ద్రవం. ప్రవహించటం దాని ప్రధాన గుణాల్లో ఒకటి.
నేల చదరంగా విస్తరించిన కాగితంలా పల్లం వైపు వ్యాపిస్తున్నప్పుడు, అంటే నది నీరు గట్టుకి దగ్గరవుతున్న కొద్దీ ఆ నీటికి ఒత్తిడి, రాపిడి ఏర్పడతాయి. కారణం ఇరువైపులా ఒడ్డు దగ్గర నేల లోతు తక్కువగా ఉండటమే. ఈ ఒత్తిడి, రాపిడి ఒడ్డు దగ్గర ఎక్కువ ప్రభావం చూపిస్తాయి. కాబట్టి అక్కడ నీరు వేగంగా ప్రవహించలేదు. అదే నది మధ్య భాగాన ఒత్తిడి, రాపిడి ప్రభావం ఉండదు. అందుకే అక్కడ నీరు వేగంగా ప్రవహించగలుగుతుంది.

మహిళా ఓటుహక్కు.
ఒకప్పుడు మహిళలకి ఓటుహక్కు ఉండేది కాదు. ఆ మాటకొస్తే ఇప్పటికీ కొన్ని దేశాల్లో మహిళలకి ఓటుహక్కు లేదు. ప్రపంచంలో మొట్టమొదటి సారిగా 1880లో ‘ది ఐల్ ఆఫ్ మ్యాన్’ అనే ఐలాండ్‌లో మహిళలకి ఓటు హక్కు కల్పించారు. అయితే ఈ ఐలాండ్ ఒక దేశం కాదు, యునెటైడ్ కింగ్‌డమ్‌లో ఒక భాగం మాత్రమే. 1893లో న్యూజిలాండ్‌లో మహిళలకి ఓటుహక్కు ఇచ్చారు. 1920 వరకు మహిళలకి ఓటుహక్కుని ఇచ్చిన యూరోపియన్ దేశాలు రెండు మాత్రమే. 1919లో స్వీడన్‌లో, 1920లో చెకోస్లవేకియాలో మహిళలకి ఓటుహక్కు వచ్చింది. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో కూడా 1920లోనే మహిళలకి ఓటుహక్కుని ప్రకటించారు. అయితే అప్పటికే అక్కడ కొన్ని రాష్ట్రాల్లో అది అమలులో ఉంది. 1945 వరకు ఫ్రాన్స్, ఇటలీ దేశాలలో మహిళలు ఓటు వేసే అవకాశం లేదు. 1971 వరకు స్విట్జర్లాండ్‌లో, 1984 వరకు లిచెన్‌స్టీన్‌లో మహిళలకి ఓటుహక్కు లేదు. కువైట్‌లో అయితే 2005 వరకు కూడా ఓటు వేయడానికి మహిళలని అనుమతించలేదు.
నీళ్లు నీలంగా ఎందుకు కనిపిస్తాయి?
బురదనీరు తప్ప నదిలో, సముద్రంలో నీరు లేత నీలంగా, పచ్చ, నీలం కలిసిన రంగులో, లేత పచ్చగానూ కనిపిస్తాయి. ముఖ్యంగా నీలంరంగు ఎక్కువగా కనిపిస్తుంది. ఆకాశంలో మేఘాలు లేకుండా,ఎండ ఉన్నప్పుడు నీరు నీలంగాకనిపిస్తుంది. దీనికి ప్రధాన కారణం వెలుగు,దాని పరావర్తన గుణం.వస్తువుల మీద, పదార్థాల మీద వెలుగు పడినప్పుడు వెలుగు కిరణాలు కొన్ని ‘పరావర్తనం’ చెంది ఆ వస్తువుకున్న రంగును చూపుతాయి. అలాగే సూర్యకాంతి నీటి మీద పడనప్పుడు ముఖ్యంగా ఎరర్రంగు కిరణాలు ఇంకి పోయి కేవలం నీలిరంగు కిరణాలే ప్రతిబింబిస్తాయి.ఇలా కనిపించాలంటే నీరు కనీసం మూడడుగుల లోతైనా ఉండాలి. తక్కువ నీరు ఉండి,నీటి కింద నేల,ఇతర వస్తువులు స్పష్టంగా కనిపించేటప్పుడు నీలిరంగు కనబడదు. సముద్రపు ఒడ్డునగానీ, నీటిని చేతిలోకి తీసుకున్నప్పుడు గానీ ఆ నీళ్లు నీలంగా కనబడవు.
ఈస్ట్ ఇండియా కంపెనీ పెత్తనం
ఈస్ట్ ఇండియా కంపెనీ మనదేశంలో ప్లాసీ యుద్ధం వరకు కేవలం వర్తక సంఘంగా మాత్రమే కొనసాగింది. ఇంగ్లండ్‌లో తయారయ్యే వస్తువులను, ఖరీదైన లోహాలను తెచ్చి మనదేశంలో అమ్మి ఇక్కడ దొరికే విలువైన వస్తువులను ఇంగ్లండ్‌కు తీసుకు వెళ్లేది. వాటిని ఇంగ్లండ్‌తోపాటు యూరప్ దేశాల్లో అధిక ధరలకు అమ్ముకునేది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో వస్తువుల తయారీని ప్రోత్సహించింది. కాని బ్రిటిష్ ఉత్పత్తిదారులు దానిని వ్యతిరేకించారు. భారతదేశంలో తయారైన వస్తువులకు ఇంగ్లండ్‌లో గిరాకీ పెరగడం వారికి కన్నుకుట్టింది. బ్రిటిష్ పార్లమెంటులో భారతదేశ వస్తువుల దిగుమతులను అరికడుతూ అనేక చట్టాలు ప్రవేశపెట్టినప్పటికీ 18వ శతాబ్ది మధ్య భాగం వరకు భారతదేశ ఉత్పత్తులకు ఇంగ్లండ్‌లో ఎక్కువ ప్రచారం లభించింది.
బ్రిటిష్ కంపెనీ మనదేశంలో క్రమంగా రాజ్యాక్రమణ మీద ఆసక్తి చూపి తర్వాత రాజకీయ అధికార విస్తరణకు పూనుకోవటంతో వారి వ్యాపారంలో కూడా మార్పులు చోటు చేసుకున్నాయి. భారతదేశంలోని ఉత్పత్తిదారులు తమ సరుకులను బ్రిటిష్ వర్తకులకే అమ్మాలని కంపెనీ ప్రభుత్వం హుకుం జారీ చేసింది. కంపెనీ ఉద్యోగులు నేత పనివారికి కొంత మొత్తాన్ని ముందుగానే అప్పులుగా ఇచ్చి వారిని పరోక్షంగా బంధించారు. తన రాజకీయ అధికారాన్ని ఉపయోగించి, పోటీ వ్యాపారులను తొలగించ గలిగింది. ఈ చర్యల వల్ల వస్తు ఉత్పత్తిలో అభివృద్ధి సాధించకపోగా, దేశీయ ఆదాయం, ఆర్థిక ప్రగతి కృంగిపోయాయి.
18వ శతాబ్దపు మధ్యభాగంలో ఇంగ్లండ్‌లో సంభవించిన పారిశ్రామిక విప్లవం, కొత్త రకమైన ఉత్పత్తిదారుల విజృంభణకు దారి తీసింది. భారత దేశంలోని వ్యాపారంపై కంపెనీ గుత్తాధిపత్యం వారికి నచ్చలేదు.1813లో చార్టర్ చట్టం అప్పటి వరకు భారత్ వ్యాపారంపై ఆ కంపెనీకి ఉన్న గుత్తాధికారానికి ముగింపు పలికింది. భారతదేశంలో వ్యాపారం చేయటానికి బ్రిటిష్ పౌరులకు అవకాశం దొరికింది. భారతదేశం ఇంగ్లండ్ అధీనంలోకి వచ్చింది. అప్పటి నుంచి భారత దేశాన్ని ఇంగ్లండ్‌కు ఆర్థికవలస దేశంగా పరిగణించారు. భారతదేశ ఆర్థిక విధానం బ్రిటిష్ వారి అవసరాలకు అనుగుణంగా మార్చబడింది. ఈ కారణంగా దేశంలోని భారీ పరిశ్రమలే కాక, చేతిపనులు, గ్రామీణ పరిశ్రమలు కూడా బాగా దెబ్బతిన్నాయి.
తుపాను ఎలా వస్తుంది?
పెనుగాలి, దానితో పాటు కుంభవృష్టి... ఒకచోట నుంచి మరో చోటికి వేగంగా కదిలిపోతుంటుంది. దీన్నే తుపాన్ అంటాం. భూమధ్యరేఖాప్రాంతాల నుంచి తేమగా ఉండే వేడిగాలి బయలు దేరి, ఉత్తరార్ధగోళ ప్రాంతాల్లో పొడిగా ఉండే గాలిని కలిసినప్పుడు తుపాను మొదలవుతుంది. నిజానికి ఈ రెండు గాలులూ కలగలిసిపోవు. ఈ రెండు రకాల గాలులు ఉద్ధృతంగా కలిసేచోట వేడిగాలి చల్లగాలి కంటే పైకి ఎగసి చల్లబడిపోతుంది.
అప్పుడు గాలిలోని తేమదనం చిక్కబడి మేఘాలు ఏర్పడతాయి. తుపాన్ మధ్య ప్రాంతంలో గాలి ‘పీడనం’ తరిగిపోవడం ఆరంభిస్తుంది. అప్పుడు ‘అల్ప పీడనం’ ఆ ప్రాంతం చుట్టూ గుండ్రంగా తిరుగుతుంది. అదే ఉత్తరార్ధగోళ ప్రాంతంలోనైతే గాలి ‘అపసవ్య’ దిశలో వీస్తుంది. అంటే వేడిగాలి ఉత్తరం వైపున, చల్లని చలిగాలి దక్షిణం వైపున సాగి పశ్చిమ దిశవైపు తిరుగుతుంది. దీన్నే ‘అల్ప పీడనం’ అంటారు. ఈ ‘అల్పపీడన’ ప్రాంతాన్నే మరో మాటలో తుపాన్ అంటాం.
అలీఘర్ ఉద్యమం
19వ శతాబ్దంలో ముస్లింలు రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. మొఘల్ సామ్రాజ్యం పతనం తర్వాత వారు నిరాశ చెందారు. బ్రిటిష్ ప్రభుత్వం 1857 తిరుగుబాటును అణచి వేసిన తర్వాత ఆ తిరుగు బాటుకు ముస్లింలే కారణం అనే భావనతో ముస్లిం వ్యతిరేక విధానాల్ని అవలం బించింది. దాంతో ముస్లింలలో బ్రిటిష్ వారి పట్ల తీవ్రమైన వ్యతిరేకత పెరిగింది, వారు పాశ్చాత్య విద్యను వ్యతిరేకించారు. అయితే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్ చేసిన కృషి వలన వారిలో చైతన్యం పెరిగింది. అలీఘర్ ఉద్యమ స్థాపకుడే సర్ సయ్యద్ అహ్మద్ ఖాన్. ఆయన 1876లో మహ్మదీయ ఆంగ్లో ఓరియంటల్ కళాశాలను స్థాపించాడు. హైదరాబాద్ ప్రధానిమంత్రి సాలార్‌జంగ్ ప్రోత్సాహంతో దీనిని ముస్లింల కేంద్ర విద్యాసంస్థగా రూపొందించారు.
మహ్మదీయుల్లో రాజకీయ చైతన్యం పెంచటం, ఆధునిక విద్యను ప్రచారం చేయటం అలీఘర్ ఉద్యమ ముఖ్య ఆశయాలు. బ్రిటిష్ అధికారులు ఈ ఉద్యమాన్ని సమర్థించారు. దీని వలన దేశంలోని ముస్లిం మధ్య సమైఖ్యత పెరిగింది.
ఇస్లాం మతం పట్ల విధేయత తగ్గకుండా పాశ్చాత్య విద్యను ప్రచారం చేయటం ఈ ఉద్యమం లక్ష్యం. ఈ ఉద్యమం బహు భార్యత్వాన్ని, ఘోషా పద్ధతిని ఖండించింది. స్ర్తీ విద్యను ప్రోత్సహించింది. ఉద్యమాన్ని ప్రారంభించిన సర్ సయ్యద్ అహ్మద్ భారతదేశంలోని హిందువులు, ముస్లింలు ఒకటే అని నమ్మారు. పరమతసహనం మంచిదని ప్రచారం చేశాడు. మత ఘర్షణలు వ్యతిరేకించాడు. అహ్మద్ ఖాన్ ఉదార వాది, అయినప్పటికీ ఆయన కాంగ్రెస్ ఉద్యమాన్ని వ్యతిరేకించాడు. బ్రిటిష్ ప్రభుత్వం ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని అంగీకరిస్తే అధికారం హిందువులకే లభిస్తుందని భావించాడు. దాంతో మతతత్వ వాదిగా మారాడు.
‘యురేనియం’ అంటే ఏమిటి?
మనకు బాంబుల గురించి, వాటికి అవసరమైన లోహాల గురించి ప్రసక్తి వచ్చినప్పుడల్లా‘ యురేనియం’ పేరు వినబడుతుంది. అసలు యురేనియం అంటే ఏమిటి? అనే విషయం తెలుసుకుందాం.
యురేనియం అంటే ధార్మికశక్తి అధికంగా ఉంటే మూలకం. రసాయనికపరంగా వ్యవహరించేటప్పుడు దీనికి ’్ఖ’ అనే చిహ్నం వాడతారు. యురేనియంలో అధిక భాగం వెండిరంగులో ఉండే అనేక పసుపురంగులోని ఛాయలు మెరుస్తాయి. అయితే యురేనియం అంత ఎక్కువగా దొరకదు. కానీ ఖనిజాల కోసం భూమిని తొలిచి వెదుకుతున్న సమయంలో యురేనియం నిల్వల సంగతి సులభంగా తెలిసిపోతుంది. కారణం యురేనియం ధార్మిక శక్తి ప్రభావం ఆ ఖనిజపు నిల్వలు ఉన్నచోట స్పష్టంగా వ్యక్తమవుతుంది. సాంకే తిక పరికరాలకు ఈ ప్రభావం అందుతుంది. యురేనియంలోని అణువులు ఇతర లోహాల అణువుల కన్నా బరువుగా ఉంటాయి.
యురేనియం ఐసోటోప్‌లలోని అణువులను రెండు భాగాలుగా విడదీయవచ్చు. దీనివల్ల విపరీతమైన శక్తి విడుదలవుతుంది. అణు బాంబుల తయారీకి శుద్ధిచేసిన యురేనియాన్ని వాడతారు. అణు రియాక్టర్ల లో విద్యుదుత్పాదనకూ వాడతారు. యురేనియం నుంచి ప్లుటోనియాన్ని కూడా రాబట్టవచ్చు.
వీనస్ మీద గాలి ఉంటుందా?
సౌర కుటుంబంలో సూర్యుని తరువాత రెండవ గ్రహం ‘వీనస్’. సూర్యుని చుట్టూ తిరగటానికి ఈ గ్రహానికి 225 రోజులు పడుతుంది. తన చుట్టూ తాను తిరగటానికి 243 రోజులు పడుతుంది. భూమికి అతి సమీపంగా ఉన్న గ్రహం వీనస్. ఒక్కోసారి ఆకాశంలో స్పష్టంగా కనిపిస్తుంటుంది కూడ.ఈ గ్రహం చుట్టూ దట్టమైనమేఘాలుఉంటాయి.
కాబట్టి టెలిస్కాప్ లేకుండా కనిపించదు. వెనీరా అనే అంతరిక్ష నౌకలు ‘వీనస్’ గ్రహం మీద దిగి ఎంతో విలువైన సమాచారాన్ని పంపాయి. అయితే ‘మేర్నియర్ 10’ అనే అంతరిక్ష నౌక వీనస్ గురించి సమగ్ర సమాచారాన్ని పంపగలిగింది. భూమి మీద ఉన్నట్లే వీనస్ మీద కూడా అగ్ని పర్వతాలు, కొండలు, లోయలు ఉన్నాయి. ఆఫ్రికా ‘రిఫ్ట్ వ్యాలీ’ వలే భూమి చీలినట్టు లోయలున్నాయి. వీనస్ ఉపరితలం మీద ఉష్ణోగ్రత 896 డిగ్రీల ఫారెన్ హీట్ ఉంటుంది. ఈ గ్రహం మీద కార్బన్ డై ఆక్సైడ్ దట్టంగా అలుముకుని ఉంది. చుట్టూ ఉన్న మేఘాలు సల్ప్యూరిక్ యాసిడ్ మయం. ఇది జీవులకు అనువైన వాతావరణం కాదు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ప్రపంచంలోని దాదాపు అన్ని దేశాల్లో ఏటా మార్చి 8వతేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకుంటారు. ఇది అంతర్జాతీయ ‘శ్రామిక మహిళాదినోత్సవం’. దీనికి పునాది సోషలిస్టులలోని రాజకీయ భావాలు. అమెరికాలో సోసలిస్టు పార్టీ మొదటిసారిగా అంతర్జాతీయ మహిళాదినోత్సవాన్ని నిర్వహించింది.
1910లో జర్మనీలోని కోపెన్‌హాగెన్ లో జరిగిన ‘ఇంటర్నేషనల్ విమెన్స్ కాన్ఫరెన్స్’లోనూ ‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం’ ప్రస్తావన వచ్చింది. 1911 మార్చి 19న ఆస్ట్రియా, డెన్మార్క్, జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలలో లక్షలాది ప్రజలు మహిళాదినోత్సవాన్ని జరుపుకున్నారు.
రష్యాలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జరిగిన ప్రదర్శనలను... 1917లో జరిగిన రష్యన్ విప్లవానికి మొదటిదశగా చెప్పుకోవచ్చు. పశ్చిమదేశాల్లో 1977 తర్వాత అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరపడం ప్రారంభించారు. కారణం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ మార్చి 8వ తేదీని మహిళల హక్కుల కోసం, అంతర్జాతీయ శాంతి కోసం ప్రత్యేక దినంగా పాటించాలని తీర్మానించింది. ‘మహిళలకి అన్ని రంగాలలో సమాన హక్కులు ఉండాలి’ అనే ఉద్దేశంతో రూపొందిన ఈ కార్యక్రమం... కాలక్రమంలో రాజకీయ, సమానత్వ భావనలకు దూరమైంది. చాలా చోట్ల కేవలం ఒక మొక్కుబడి వేడుకగా మారింది.
రాజ్యసంక్రమణ సిద్ధాంతం
బ్రిటిష్ గవర్నర్ జనరల్‌గా పనిచేసిన ముఖ్యమైన వారిలో డల్‌హౌసీ ఒకడు. అతడు ప్రవేశపెట్టినదే రాజ్యసంక్రమణ సిద్ధాంతం. దీంతో డల్‌హౌసీ బ్రిటిష్ సామ్రాజ్య వ్యాప్తికి కృషిచేశాడు. భారత స్వతంత్ర రాజ్యాలను రద్దు చేసి వాటిని ఆక్రమించుకోవటానికి పూనుకున్నాడు. 1848-56 మధ్య కాలంలో గవర్నర్ జనరల్‌గా పనిచేసిన డల్‌హౌసీ తన పరిపాలన కాలంలో భారతదేశంలోని స్వతంత్ర రాజ్యాలను బ్రిటిష్ సామ్రాజ్యంలో కలపటానికి పూనుకున్నాడు. ఆవగింజంత అవకాశం దొరికినా విడిచిపెట్టలేదు. బ్రిటిష్ పాలన ఉదాత్తమైందని, స్వదేశీ ప్రభుత్వాల కంటే మెరుగైనదని భావించేవాడు. సంస్థానాధీశులను తొలగించి భారతదేశాన్ని పూర్తిగా బ్రిటిష్ ప్రభుత్వం కిందకు తీసుకురావడానికి కృషి చేశాడు.

ఈ క్రమంలో అతడు అనేక అక్రమాలకు పాల్పడ్డాడు. ఈ సిద్ధాంతం ప్రకారం సంస్థానాధీశులకు పుత్రులు లేకపోతే ఆ రాజ్యాలు బ్రిటిష్ వారికి చెందుతాయి. దత్తత తీసుకున్న పిల్లలను రాజ్యానికి వారసులుగా ప్రకటించడానికి వీల్లేదని ఈ సిద్ధాంతంలో ఉన్న మెలిక. దీనికి దత్తత స్వీకార రద్దు చట్టం అని కూడా పేరు.
డల్‌హౌసీ ఈ సిద్ధాంతాన్ని తీసుకొచ్చినప్పుడు చాలామంది రాజులకు సంతానం లేదు. ఆ రాజ్యాలన్నింటినీ బ్రిటిష్ సామ్రాజ్యంలో కలిపేసి, రాజ్యాన్ని విస్తరించాడు. ఝాన్సీ, సతారా, సంబల్‌పూర్, నాగ్‌పూర్, జైల్‌పూర్, భాగత్ ఉదయపూర్ వంటి అనేక సంస్థానాలు రాజ్యసంక్రమణ సిద్ధాంతం ప్రకారం బ్రిటిష్ వశమయ్యాయి. డల్‌హౌసీ తన సిద్ధాంతాన్ని అమలు పరచడంలో భారతీయుల మనోభావాల్ని ఏ మాత్రం పరిగణనలోకి తీసుకోలేదు.
డల్‌హౌసీ రెండవ సిక్కు యుద్ధం, రెండవ బర్మా యుద్ధం చేశాడు. ఈ రెండు యుద్ధాల వల్ల వ్యాపారాభివృద్ధి కూడా సాధ్యమైంది. సిక్కింపై దండయాత్ర చేసి చాలా ప్రాంతాలను స్వాధీన పరుచుకున్నాడు. 1856లో అయోధ్యను ఆక్రమించి, మొగల్ చక్రవర్తికి భరణాన్ని రద్దు చేశాడు. ఆర్కాట్ నవాబ్‌కు బిరుదును తొలగించాడు. డార్జిలింగ్ రాజుకు అద్దెను నిలిపివేశాడు. కప్పం సరిగా చెల్లించటంలేదనే నెపంతో నిజాం నుంచి సారవంతమైన ప్రాంతాన్ని ఆక్రమించుకున్నాడు
 
ఫ్రాన్సిస్కో డి అల్మిడా

16 శతాబ్దంలో పోర్చుగీసు వారు భారత దేశంపై తమ ఆధిపత్యం కొనసాగించే ప్రయత్నాలను తీవ్రం చేశారు. ఇండియాలో ఉన్న పోర్చుగీసు వారి స్థావరాలను కాపాడడం కోసం ‘ఫ్రాన్సిస్కో డి అల్మిడా’ని ఇండియాకి పంపించారు. ఆయనను ‘ద గ్రేట్ డామ్ ఫ్రాన్సిస్కో’ అని కూడా పిలిచేవారు. అల్మిడా 1450లో పోర్చుగల్ రాజధాని లిస్బన్‌లో జన్మించాడు.
అల్మిడాని 1505 మార్చి 25న ఇండియాలో పోర్చుగీస్ మొదటి గవర్నర్, వైస్రాయ్‌గా నియమించారు. అల్మిడా 22 నౌకల సమూహం, 1500మంది సిబ్బందితో సెప్టెంబర్ 13న ఇండియాలోని అంజదీప్ ఐలాండ్‌కి చేరుకున్నాడు. వెంటనే అక్కడ ఫోర్టు నిర్మాణాన్ని చేపట్టాడు. ఆ తర్వాత కాననోర్ ( కేరళ లోని కన్నూరు) ప్రాంతంలో సెయింట్ ఏంజెలో ఫోర్ట్‌ని నిర్మించాడు. అక్టోబర్ 31న కొచ్చిన్ చేరుకుని అక్కడే నివాసం ఏర్పాటు చేసుకున్నాడు. కొచ్చిన్‌లో మాన్యుయేల్ కోటని బలోపేతం చేశాడు.
అప్పటివరకు పోర్చుగీసు వారు ఇండియాకి ఓడల్లో వచ్చి పర్యవేక్షించి వెళ్లే తాత్కాలిక పద్ధతి ఉండేది. అల్మిడా వచ్చిన తర్వాత శాశ్వత పాలనా పద్ధతి మొదలైంది. అయితే అతను భూమిపై స్థావరాల అభివృద్ధి కన్నా సముద్రంపై ఆధిపత్యం సాధించడానికే ఎక్కువ ఆసక్తిని కనబరిచాడు. ఓడల నిర్మాణానికి, నౌకాదళాన్ని బలోపేతం చేయడానికి అధిక ప్రాధాన్యతను ఇచ్చాడు. భారతదేశంపై ఆధిపత్యం చలాయించాలంటే కోటల నిర్మాణం, సైనికుల నియామకం లాంటి చర్యలు చేపట్టాలి. అంతకంటే ముందుగా సముద్ర మార్గాల మీద పట్టు సంపాదిస్తే మంచిదని అల్మిడా భావించాడు. అల్మిడా తిరిగి పోర్చుగల్ చేరుకోకుండానే 1510లో భారతదేశంలోనే మరణించాడు.
గ్రహానికి, నక్షత్రానికి తేడా ఏమిటి?
మనం రోజూ రాత్రి ఆకాశంలో నక్షత్రాలను చూస్తుంటాం. సౌరకుటుంబంలో భూమితో పాటే కొన్ని గ్రహాలు ఉంటాయని తరచూ వింటూంటాం. నక్షత్రానికి, గ్రహానికి తేడా ఏమిటో ఇప్పుడు చూద్దాం. నక్షత్రం అంటే అనేక వాయువులతో మండే ఒక అగ్నిగోళం. అన్ని నక్షత్రాల్లోనూ హైడ్రోజన్, హీలియం అనే వాయువులు మండుతూ వెలుగునిస్తూ ఉంటాయి. దానికి కారణం నక్షత్రాల కేంద్రం నుంచి పుట్టే అపరిమితమైన వేడి.
కాబట్టి నక్షత్రం స్వయంగా ప్రకాశిస్తుంది. గ్రహాలు అంటే నక్షత్రాల కంటే చాలా చిన్నవి. గట్టిగా, ఘన పదార్థరూపంలో ఉండే ఒక గోళం. గ్రహం స్వయంప్రకాశం కాదు. ఎందుకంటే నక్షత్రాలకు ఉండే వేడి గ్రహాలకు ఉండదు. గ్రహాలకు దగ్గరగా ఉండే నక్షత్రాల వల్ల కొన్ని గ్రహాలు కూడా వెలుగుతున్నట్లు కనిపిస్తాయి. సూర్యుడికి సమీపంలో ఉండే గ్రహాలు వెలుగుతూ కనిపిస్తాయి.
అత్యంత చిన్న చేప ఏది?
చేపల్లో పెద్దపెద్ద చే పలూ, చిన్నచిన్న చేపలూ ఉంటాయని మనందరికీ తెలుసు. కాని చాలా చిన్న చేప గురించి ఎప్పుడైనా విన్నారా! ‘పేడోసిప్రిస్ ప్రోజెనిటికా’ అనే చేప ప్రపంచంలోకెల్లా అత్యంత చిన్న చేప అని శాస్తజ్ఞ్రులు కనుగొన్నారు. ఇది సకశేరుకాల్లో అంటే వెన్నుముక గల జీవుల్లోకెల్లా అత్యంత చిన్నది. ఇది ఎంత చిన్నగా ఉంటుందంటే... దీని పొడవు కేవలం 7.9 మిల్లీ మీటర్లు. అంటే అంగుళంలో మూడో వంతు కన్నా తక్కువే.
దీనిని ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో కనుగొన్నారు. పారదర్శకంగా ఉండే ఈ చేప చూడడానికి లార్వా లాగ కనిపిస్తుంది. ఈ చేపలు టీ రంగులో ఉన్న నీటిలో నివసిస్తాయట. ఈ చేపలు నివసించే నీటికి వర్షపు నీటి కన్నా దాదాపు వంద రెట్లు ఆమ్లత్వం ఉం టుంది. లండన్‌లోని నేచురల్ హిస్టరీ మ్యూజియమ్‌కి చె ందిన జంతు శాస్తవ్రేత్త రాల్ఫ్ బ్రిట్జ్ ఈ చేప గురించి ‘‘నా కెరీర్ మొత్తంలో నేను చూసిన అత్యంత వింతైన చేప ఇది’’ అన్నారు.
గదర్ పార్టీ ఉద్యమ నేత..
భారత జాతీయోద్యమంలో గదర్ పార్టీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. స్వదేశాన్ని బ్రిటిష్ పాలన నుంచి విముక్తి చేయడానికి అమెరికా, కెనడాలలోని భారతీయులు (ఎక్కువ శాతం పంజాబ్‌కి చెందినవారు) ఏర్పాటుచేసినదే గదర్ పార్టీ. ఈ పార్టీ ముఖ్యమైన సభ్యుల్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వ్యక్తి దరిశి చెంచయ్య ఒకరు. ఆయన గదర్ పార్టీ చేపట్టిన కార్యక్రమాలలో కీలక బాధ్యతలు నిర్వహించారు. దరిశి చెంచయ్య ఉన్నతవిద్యను అభ్యసించడం కోసం అమెరికా వెళ్లి బర్కిలీలోని కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో చేరాడు.
కాని లాలా హరదయాళ్ ప్రసంగాలతో ఉత్తేజితుడై గదర్ పార్టీలో చేరి, ఆ పార్టీ వ్యవస్థాపక సభ్యులలో ఒకరయ్యారు. బర్మాలో తిరుగుబాటు నిర్వహించే కష్టమైన బాధ్యతను పార్టీ ప్రముఖులు చెంచయ్యకు అప్పగించారు.ఆసియా, అమెరికాలకు చెందిన గదర్ నాయకుల సహాయంతో బర్మాను విముక్తిచేసిన తర్వాత జర్మనీ సహాయంతో భారతదేశంలో తిరుగుబాటు లేవనెత్తడం గదర్ ఉద్యమ లక్ష్యం. బర్మా సరిహద్దులో తిరుగుబాటు దళాలకు చెంచయ్య సంధానకర్తగా వ్యవహరించాడు. ఆ పథకం విఫలం కావడంతో చెంచయ్య బందీ అయి జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన నిర్బంధంలో ఉన్నప్పుడు అనేక కఠిన పరిస్థితులను ధైర్యంగా ఎదుర్కొన్నాడు. గదర్ పార్టీ రహస్యాలను తెలుసుకోవడానికి బ్రిటిష్ అధికారులు చెంచయ్యను ఎన్నో చిత్రహింసలకు గురిచేశారు. అయినప్పటికీ ఆయన నోరు విప్పలేదు. చెంచయ్యపై కాన్పూర్ కుట్ర కేసు బనాయించి చాలా కాలం జైల్లో ఉంచారు. 1919వ సంవత్సరంలో ఆయనను విడుదల చేశారు. కానీ తిరిగి రెండవ ప్రపంచ యుద్ధ కాలంలో నిర్బంధించారు.
కాంగ్రెస్ కంటే ముందు భారతీయ సంఘం
<><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><><>
కాంగ్రెస్ కంటే ముందు ప్రారంభమైన జాతీయ సంస్థలలో చాలా ముఖ్యమైనది కలకత్తా భారతీయ సంఘం. ప్రఖ్యాత నాయకుడు సురేంద్రనాథ్ బెనర్జీ పోత్సాహంతో ఈ సంఘాన్ని1876లో స్థాపించారు. ఆయన భారతదేశమంతా పర్యటించి ప్రజలు ఆకట్టుకునేలా ఉపన్యాసాలు ఇచ్చి దేశ రాజకీయాలలో ప్రముఖ పాత్ర పోషించాడు. ఉమ్మడి రాజకీయ కార్యక్రమాలతో భారత ప్రజల్ని సమైక్యపరచటం, హిందూ, ముస్లింల మధ్య సఖ్యతను పెంపొందించడం, దేశంలో బలమైన ప్రజాభిప్రాయాన్ని ఏర్పరచడం, ప్రజలను ఉద్యమాలలో కలుపుకోవడం భారతీయ సంఘం ఉద్దేశాలు.

క్రిమినల్ కేసులలో నిందితులైన బ్రిటిష్ జాతీయులను విచారించడానికి భారతీయ జడ్జీలకు అధికారం కల్పించే ఇల్బర్ట్ బిల్లును సమర్థిస్తూ ఆందోళన నిర్వహించింది. ఈ ఆందోళన పటిమను చూసి బ్రిటిష్ అధికారులు ఆశ్చర్యపడ్డారు. దేశీయ పత్రికలకు వ్యతిరేకంగా ఆమోదించిన శాసనాన్ని కూడా ఈ సంఘం ఘాటుగా విమర్శించింది. స్వదేశీ వస్త్ర పరిశ్రమ ప్రయోజనాలు దెబ్బతినేలా, లాంక్‌షైర్ మిల్లు వస్ర్తాలకు అనుకూలంగా దిగుమతి సుంకాలను రద్దు చేయడాన్ని వ్యతిరేకించింది. ఈ సంఘం లార్డ్ రిప్పన్ పరిపాలనా కాలంలో ప్రజాసమస్యలని చర్చించేందుకు ముఖ్యవేదిక అయింది. 1883లో ఈ సంఘం మొదటి జాతీయ సమావేశం కలకత్తాలో జరిగింది. దేశంలోని రాజకీయ సమస్యలని చర్చించింది. ఈ సంఘ కార్యక్రమాలని భారత కాంగ్రెస్ ఆమోదించటం వల్ల ఇది కాంగ్రెస్‌లో 1886లో విలీనమైంది.
సాలెపురుగులు కీటకాలేనా?
సాలెపురుగులు చాలామంది అనుకున్నట్టుగా కీటకాలు కావు. ఇవి ఎరాఖ్నిడ్స్ అనే వేరే జాతికి చెందినవి. తేళ్లు కూడా ఈ జాతికి చెందినవే. సాలెపురుగు శరీరం రెండు భాగాలుగా ఉంటుంది. ఆ రెండు భాగాలను కలుపుతూ సన్నని నడుము లాంటి భాగం ఉంటుంది. సాలె పురుగులకి రెక్కలుండవు. కానీ నాలుగు జతల కాళ్లుంటాయి. అన్ని సాలెపురుగులు దారంలాంటి పదార్థాన్ని ఉత్పత్తి చేయగలవు. కానీ కొన్ని మాత్రం గూడుని అల్లుకోలేవు. సాలెపురుగులలో కనీసం 35,000 జాతులు ఉంటాయి.


వీటిలో చాలావరకు హానికరమైనవి కావు. అయితే కొన్ని జాతులు మాత్రం ప్రాణాపాయాన్ని కలుగజేస్తాయి. మధ్య, దక్షిణ అమెరికా ప్రాంతాల్లో ఉండే ‘బనానా స్పైడర్’ ఆరు మిల్లీ గ్రాముల విషాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఆ విషం ఆరుగురి ప్రాణాలను తీయగలదు. ‘ఫనెల్ వెబ్’, ‘వోల్ఫ్ స్పైడర్’, ‘బ్లాక్ విడో’ లాంటివి కూడా ప్రమాదకరమైనవే. దక్షిణ అమెరికాలోని వర్షపాత అడవుల్లో ఉండే ‘గోలియాత్ బర్డ్ ఈటింగ్ స్పైడర్’ అనేది అతి పెద్ద సాలెపురుగు. దీని పొడవు 25 సెంటీమీటర్లు. వెస్టర్న్ సమోవా ప్రాంతంలో ఉండే ‘ప్యాటు మార్‌ప్లెసి’ అనే స్పైడర్ అతి చిన్నది. దీని పొడవు కేవలం 0.46 మిల్లీ మీటర్లు.
టేప్ రికార్డర్లు ఎందుకు మూలన పడ్డాయి? 
ఒకప్పుడు టేప్ రికార్డర్లలో క్యాసెట్లు పెట్టుకుని పాటలు వినేవారు. ఇప్పుడు అవి దాదాపు ఎక్కడా కనిపించడం లేదు. వాటి స్థానంలో సీడీ (కాంపాక్ట్ డిస్క్)లు వచ్చాయి. పాటలను సీడీ ప్లేయర్లలో వింటున్నారు. టేప్ కన్నా సీడీలో ఎక్కువ పాటలు ఉండడమే కాక ధ్వని కూడా వీటిలో బాగుంటుంది అంటారు. వాడిన ప్రతిసారి టేప్ నలిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే క్యాసెట్ వింటున్న ప్రతిసారి టేప్‌కి, రికార్డర్‌లో ఉండే యంత్రభాగాలకి మధ్య రాపిడి ఉంటుంది. క్యాసెట్ మీద చేరే ధూళి వల్ల కూడా నెమ్మదిగా ధ్వనిలో లోపం ఏర్పడుతూ క్రమంగా ధ్వని శక్తి తగ్గుతుంది. కాని సీడీలో రాపిడికి అవకాశం తక్కువగా ఉండటం వల్ల ధ్వనిశక్తి తగ్గే అవకాశం ఉండదు.


అందుకే ఎన్నేళ్లయినా సీడీల్లో సంగీతం పదిలంగా ఉంటుంది. కంప్యూటర్ సహాయంతో సీడీల్లో రికార్డు చేయడం వల్ల కచ్చితమైన ధ్వని స్పష్టంగా సీడీకి సరఫరా అవుతుంది. డిస్క్ కూడా కంప్యూటర్ వల్ల రూపొందిందే. కంప్యూటర్ కోడ్ సంకేతాల ద్వారా సీడీ మీద ధ్వని రికార్డ్ కావడం వల్ల ధ్వని స్పష్టంగా ఉంటుంది.
ముక్కుతో రుచి కూడా తెలుస్తుందా?
‘నాలుక ద్వారా రుచులు తెలుసుకుంటాం’ అనే విషయం చాలా మందికి తెలుసు కానీ ‘నాలుకకు రుచులు ఎలా తెలుస్తాయి?’ అనే విషయం తెలియదు. మన ముక్కు వాసనలను గుర్తించినంత సులువుగా నాలుక రుచులను గుర్తించలేదు. పదార్థాలను పూర్తిగా పలచన చేసినప్పుడు వాటి రుచిని గుర్తించటం చాలా కష్టం. ఇక చేదును గుర్తించినంత స్పష్టంగా తీపిని గుర్తించలేం. రుచికి వాసన కూడా సహకరిస్తుంది. అంటే నాలుకకు గల గ్రాహకశక్తికి ముక్కకి గల గ్రాహకశక్తి సహకరిస్తేనే రుచుల్లో సున్నితమైన తేడాలు స్పష్టంగా తెలుస్తాయి.


ముక్కుకు వాసనను స్పష్టంగా గుర్తించే పరిస్థితి లేనప్పుడు నాలుక కూడా రుచుల్లో స్పష్టమైన తేడాను గుర్తించలేదు. ఉదాహరణకు జలుబుతో ముక్కు దిబ్బడ వేసినప్పుడు కొన్ని పదార్థాల రుచిని నాలుక గుర్తించలేదు. అప్పుడు ‘నోరు అరుచిగా ఉంది’ అంటుంటాం. పరిశోధనల్లో తేలిందేమిటంటే కడుపులో ఉండగానే శిశువుకి తీపి రుచి తెలుస్తుందట. వాసనను బట్టి, రుచిని మరింతగా గ్రహించగలదు నాలుక. ఒక్కోసారి నాలుకతో నిమిత్తం లేకుండా ముక్కు గ్రహించే వాసనతోనే ఆయా పదార్థాల రుచిని కొంత వరకు గ్రహించగలుగుతాం.
నైలాన్ అంటే ఏమిటి?
నైలాన్ దుస్తులు తెలియని వారుండరు. అయితే చాలామందికి దాని గురించిన వివరాలు మాత్రం తెలియవు. నైలాన్ అనేది కృత్రిమ పాలిమర్ పదార్థం. అంటే ఒక రకమైన ప్లాస్టిక్ పదార్థం. దీనిని పెట్రోలియం ఉత్పత్తులతో తయారుచేస్తారు. నైలాన్‌ను తయారుచేసే ప్రక్రియను ‘రింగ్ ఓపెనింగ్ పాలిమరైజేషన్’ అంటారు.
అమెరికా శాస్తవ్రేత్త వాలెస్ కరోథర్స్ నైలాన్‌ని కనుగొన్నాడు. పట్టుకు ప్రత్యామ్నాయంగా దీనిని కనుగొన్నారు. పట్టుదారం కంటె నైలాన్ దారం గట్టిగా ఉంటుంది. ఇది ఎక్కువగా సాగగలుగుతుంది. అందుకే శరీరాన్ని అంటి పెట్టుకున్నట్లు ఉండే డ్రస్‌లను రూపొందించడానికి నైలాన్ వస్ర్తాన్ని ఉపయోగిస్తారు. నైలాన్‌తో దుస్తులే కాకుండా టూత్ బ్రష్ కుచ్చులు, తాళ్లు, చేపల వలలలాంటి వాటిని కూడా తయారుచేస్తారు.
రౌలత్ చట్టం 
జాతీయోద్యమాన్ని అదుపు చేయటానికి బ్రిటిష్ వారు తీసుకొచ్చిన చట్టాల్లో రౌలత్ చట్టం ఒకటి. మొదటి ప్రపంచ యుద్ధం తరవాత ఈ చట్టం అమలులోకి వచ్చింది. ప్రపంచ యుద్ధం సాగినంత కాలం ప్రభుత్వం, విప్లవ సంఘటనల్ని భారత రక్షణ చట్టం (Defence of Indian rules) నిబంధనలను అనుసరించి విచారణ జరిపి, చర్యలు తీసుకుంది. యుద్ధం ముగిసేటప్పటికి ఈ చట్టానికి కూడా కాలం చెల్లింది. విప్లవోద్యమాన్ని అదుపుచేయటానికి, ప్రభుత్వం ప్రత్యేక శాసనాలను ఆమోదించింది. స్వేచ్ఛకు బదులు ప్రభుత్వం కూడా అణచివేత విధానాన్ని అనుసరించింది. ప్రభుత్వం 1918లో న్యాయమూర్తి రౌలత్ అధ్యక్షతన కమిటీని నియమించింది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ బిల్లులను రూపొందించారు. అందువల్ల వీటిని రౌలత్ చట్టాలు అంటారు. 1919 ఫిబ్రవరిలో రెండు బిల్లులను ప్రవేశపెట్టారు. వీటిని దేశప్రజలు నల్లచట్టాలు అని విమర్శించారు. రాజకీయ భిన్నాభిప్రాయాలను విస్మరించి, భారతీయులందరూ ముక్తకంఠంతో ఈ చట్టాలను గ ర్హించారు.
భారతీయ సభ్యులందరూ వ్యతిరేకించినా వాటిని బ్రిటిష్ ప్రభుత్వం ఆమోదించింది. వీటి వల్ల ప్రభుత్వానికి, విస్తృతాధికారాలు లభించాయి. ఎవరినైనా దేశద్రోహ చర్యలకు పాల్పడ్డారన్న అనుమానంపై విచారణ జరపకుండా నిర్బంధించవచ్చు. హెబియస్ కార్ఫస్ చట్టాన్ని అమలు పరచడాన్ని ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. పత్రికల నోరు నొక్కేశారు. దేశంలో పెరుగుతున్న రాజకీయ అశాంతి దృష్ట్యా, ఆనాటి బ్రిటిష్ ఈ విధమైన శాసనాలను ఆమోదించింది. 1919 ఏప్రిల్‌నెలలో జనరల్ డయ్యర్ జలియన్ వాలాబాగ్‌లో విచక్షణారహితంగా జరిపించిన కాల్పులకు మూలం ఈ చట్టాలే.
అక్బర్ చక్రవర్తి
అ‌కు భారతదేశానికి చక్రవర్తి కావాలనే కోరిక ఉండేది. ముఖ్యంగా రాజపుత్ర రాజ్యాల మీద ఆధిపత్యం కోసం శ్రమించాడు. ఒక్కొక్క రాజ్యంపై దండెత్తుతూ తన అధీనంలోకి తెచ్చుకోసాగాడు. చాలామంది యుద్ధం చేయకనే అక్బర్‌కు లొంగిపోయారు.జైపూర్ రాజు తన కుమార్తెను అక్బర్‌కి ఇచ్చి పెళ్లి చేశాడు. మేవాడ్ రాజధాని చిత్తోడ్, రాజు రాణా ఉదయసింహుడు. ఇతడు అక్బర్‌తో సంధి చేసుకోవడానికి, వివాహ సంబంధాలు ఏర్పరచుకోవటానికి నిరాకరించాడు.అంతేకాక కాందిశీకుడైన మాల్వా సుల్తాన్ బాజ్ బహదూర్‌కు ఆశ్రయమిచ్చాడు. ఈ కారణంగా అక్బర్ 1567లో మేవాడ్ పైకి దండెత్తాడు.
ఉదయ్‌సింగ్ ఈ దండయాత్రకు ఎదురు నిలవలేకపోయాడు. దుర్గాన్ని రక్షించడంలో శూరులైన సేనానాయకులు... పట్టా, జయమల్‌లకు రాజ్యభారాన్ని వదిలి కొండలలో తలదాచుకొన్నాడు. పట్టా, జయమల్‌లు నాలుగు నెలల పాటు దుర్గాన్ని శత్రువుల బారి నుంచి రక్షించారు. ఆ తరవాత బల హీనులై లొంగిపోయారు. అక్బరు చిత్తోడ్ దుర్గాన్ని స్వాధీనం చేసుకున్నాడు.  చిత్తోడ్ పతనం తర్వాత నాలుగు సంవత్సరాలకు ఉదయసింహుడు చనిపోయాడు. తర్వాత అతని కుమారుడు రాణా ప్రతాపసింహుడు మొగలులతో పోరాడాడు. చిత్తోడ్ దుర్గం అప్పటికే పాడుబడిపోయింది.
1569 రణతంభోర్, కలింజర్ రాజులు అక్బర్ ఆధిపత్యాన్ని అంగీకరించారు. జైసల్మేర్, బికనీర్ సామ్రాజ్యాల రాజు కళ్యాణమల్ 1570లో అక్బర్‌కు లొంగిపోయాడు. అదే సంవత్సరంలో జోథ్‌పూర్ కూడా లొంగిపోయింది. భారతదేశమంతటికీ పరిపూర్ణ సార్వభౌమత్వం కానప్పటికీ రాజపుత్ర సామ్రాజ్యానికి అధిపతి అయ్యాడు అక్బర్. మేవాడ్ మినహా మిగిలిన రాజపుత్ర రాజ్యాలన్నీ అక్బర్ పాలన కిందికి వచ్చాయి. అక్బర్ రాజ పుత్రుల పట్ల చూపిన ఆదరణ వల్ల రాజపుత్రవీరుల్లో ముఖ్యమైన వారంతా చక్రవర్తికి భక్తివిశ్వాసాలతో కూడిన అనుచరులయ్యారు.
ఫ్యాన్‌కి మూడు రెక్కలే ఎందుకు?
మూడు రెక్కలే గాక నాలుగు రెక్కల సీలింగ్ ఫ్యాన్‌లు కూడా వుంటాయి. అయితే సాధారణంగా మూడు రెక్కల ఫ్యాన్‌లే ఎక్కువ వాడుకలో ఉన్నాయి. ఇందుకు కారణం ఉంది.

ఫ్యాన్ అనేది తన వెనుకన వున్న గాలిని తన ముందు భాగానికి వేగంగా తోస్తుంది. ఇలా గాలిని గది అంతటా విస్తరించేటట్లు పంపిణీ చేస్తుంది. అందుకే ఫ్యాన్‌కు రెక్కలను ఒక ప్రత్యేక పద్ధతిలో వంచిన తర్వాత అమరుస్తారు. ఒకవేళ ఈ రెక్కలను అలా వంచకుండా సమతలంగా ఉన్న వాటినే అమరిస్తే, ఆ ఫ్యాన్ ఎంతసేపు తిరిగినా కిందకు గాలి రాదు.
ఒక ఫ్యాన్‌లో అమర్చే రెక్కల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంటే, అది పంపిణీ చేయగలిగే గాలి పరిమాణం కూడా అంత హెచ్చుగా ఉంటుంది. అయితే రెక్కల సంఖ్య పెరిగే కొద్దీ ఫ్యాన్ బరువు పెరుగుతుంది. అంత బరువు ఫ్యాన్‌ను వేగంగా తిప్పడం మోటారుకు కష్టం. అంటే ఫ్యాన్ తిరిగే సామర్ధ్యం తగ్గుతుందన్న మాట. అందుకే వీటి మీద చాలా పరిశోధనలు జరిగాయి. మూడు లేక నాలుగు రెక్కల సీలింగ్ ఫ్యాన్‌లు తక్కువ విద్యుత్‌ను వినియోగించుకుని, ఎక్కువ సమర్థంగా పని చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు.మూడు లేదా నాలుగు రెక్కలు... ఫ్యాన్‌కు నిలకడగా ఉండే ‘భ్రమణ వ్యవస్థను’ అందించ గల్గుతాయి. వాటిలో మూడు రెక్కల ఫ్యాన్‌లను వాడటం వలన వినియోగదారులు పెట్టాల్సిన ఖర్చు ఆ మేరకు తగ్గుతుంది. దాంతో ఆ కోవకు చెందిన ఫ్యాన్‌లే-అంటే మూడు రెక్కల ఫ్యాన్‌లే బాగా వాడుకలోకి వచ్చాయి.
రక్షక కవాట సిద్ధాంతం
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా, దేశ స్వాతంత్య్రం కోసం ప్రజల్లో వ్యక్తమౌతున్న ఆగ్రహావేశాల్ని అదుపు చేయవలసి వచ్చింది. అయితే బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా కాకుండా వారి అదుపాజ్ఞల్లో ఉండే విధంగా ఒక కార్యాచరణను రూపొందించారు. అలా తయారయినదే జాతీయ కాంగ్రెస్... అనే వాదనలు ఉన్నాయి. ఈ వ్యవహారం రక్షక కవాట (ట్చజ్ఛ్టడ ఠ్చిఠ్ఛి ్టజిౌ్ఛటడ) సిద్ధాంతం ఆవిర్భావానికి దారి తీసిందని చెప్పవచ్చు. భారతీయులు స్వాతంత్య్రం కోసం విప్లవ మార్గంలో పయనించకుండా అడ్డుకునేందుకు కాంగ్రెస్‌ని ఏర్పాటుచేశారనే విమర్శలు కూడా ఉన్నాయి.
ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలాలజపతిరాయ్ అభిప్రాయం ప్రకారం ‘‘బ్రిటిష్ రాజ ప్రతినిధి లార్డ్ ఢప్రిన్ ఆలోచనల మేరకు భారతదేశంలోని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ప్రమాదం నుంచి రక్షించేందుకు జాతీయకాంగ్రెస్‌ను స్థాపించారు. బ్రిటిష్ పాలనకు భారతదేశంలో ప్రమాదం పొంచి ఉందని, లభించిన ఆధారాలను ప్రాతిపదికగా చేసుకుని ఎఓ హ్యూమ్ ఒక రక్షక కవాటం సృష్టించాలని నిర్ణయించుకున్నాడు’’ అని లాలాలజపతి రాయ్ అభిప్రాయపడ్డాడు. జాతీయోద్యమంలో ప్రముఖ నాయకుడు డబ్ల్యూ సి బెనర్జీ కూడా ‘‘కాంగ్రెస్ ఢప్రిన్ ప్రభువు సృష్టి’’ అని పేర్కొన్నాడు.
ఢప్రిన్ సలహా తీసుకొని ఎఓ హ్యూమ్ మరి కొంతమంది ఆంగ్లేయ అధికారులు జాతీయ కాంగ్రెస్‌ని ఏర్పాటు చేశారు. రజనీ పామీదత్ అనే జర్నలిస్ట్ ‘‘రాజ ప్రతినిధి ఢప్రిన్‌తో చే సుకున్న రహస్య ఒప్పందం ప్రకారమే కాంగ్రెస్ అవిర్భవించింది’’ అని వ్యాఖ్యానించాడు. రాష్ట్రీయ సేవక్ సమాజ్ నాయకుడైన ఎమ్మెస్ గోల్‌వాల్కర్ అభిప్రాయం ప్రకారం బ్రిటిష్ వారు కాంగ్రెస్‌ను ఒక రక్షక కవాటంగా ఉండేందుకు ఏర్పాటు చేసుకున్నారు.
వారి ముఖ్య ఉద్దేశ్యం భారతదేశంలో ప్రజ్వరిల్లుతున్న జాతీయత భావాల్ని అదుపులో ఉంచటం, జాతీయ దృక్పథాలను నాశనం చేయటం. అయితే ఆచార్య బిపిన్‌చంద్ర మాత్రం రక్షక కవాట సిద్ధాంతాన్ని కొట్టి పారేశాడు. ఒక సంస్థను నెలకొల్పి రాజకీయ విషయాలు చర్చిస్తే దేశంలోని ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవటానికి వీలుపడుతుందని హ్యూమ్ అలా చేశాడని ఆయన వాదించాడు.
రాకెట్ వేగంలో తేడా వస్తే?
‘రాకెట్ ప్రయాణించడానికి వేగాన్ని నిర్దేశిస్తారు. దాని ప్రకారమే ప్రయాణించాలి. దాని ప్రకారం బయలుదేరాక అది చంద్రుడి మీద దిగడానికి ఎంత సమయం పడుతుందో లెక్కిస్తారు.  దీనికి కచ్చితమైన గణితం ఉంటుంది. కొంత గురి తప్పినా ఏమవుతుంది? విశాలమైన చంద్రగ్రహం మీద మరోచోట దిగుతుంది. గదా? అనడానికి లేదు. రాకెట్ యాత్ర వేగం కచ్చితంగా లేకపోతే లక్ష్యం తప్పే ప్రమాదం ఉంది. ఎందుకంటే విశ్వం చాలా విశాలమైంది. రాకెట్ భూమ్యాకర్షణ నుంచి బయట పడేందుకు గంటకు 42 వేల కి.మీ వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది.
ఆ తరువాత చంద్రుడి మీద దిగేందుకు 1250 కి.మీ. వేగంతో ప్రయాణించాలి. రాకెట్ వేగం సంగతి అటుంచితే చంద్రుడు కూడా భూమి చుట్టూ గంటకి 3836 కి.మీ. వేగంతో తిరుగుతాడు. కనుక భూమికి, చంద్రుడికీ మధ్య దూరం 52,800 కి.మీ. కాబట్టి రాకెట్ అనుకున్న చోట దిగాలంటే భూమి, చంద్రుడు, రాకెట్ వేగాలను ఖచ్చితంగా తేల్చడానికి నిపుణులు అనుక్షణం కృషి చేయాలి. ఆపై చంద్రగ్రహ ఆకర్షణ శక్తికి తగిన వేగాన్ని చంద్రుడికి 3వేల కి.మీ. దూరం నుంచే మార్చవలసి ఉంటుంది. రాకెట్ ప్రయాణ వేగంలో రెండు కి.మీ తేడా వచ్చినా, ప్రయాణ దిశ ఒక్క‘డిగ్రీ’ మారినా రాకెట్ చంద్రగ్రహం మీద దిగడంలో ఏడు గంటల తేడా రావచ్చు. కొన్నిసార్లు చంద్రుడి పై దిగకుండా పూర్తిగా తప్పిపోవడం కూడా జరగవచ్చు.
ఫొటో ఫిల్మ్ ఎలా తయారుచేస్తారు?
ఫోటోలు తియ్యడానికి, సినిమా నిర్మించడానికి ఫిలిమ్‌ని వాడుతుంటారని తెలుసు కదా! కెమెరా డబ్బాలో ముఖ్యమైనది ఫిలిమ్. మొదట అది ఒక రకంగా కాగితం. దాని మీద రసాయనాల లేపనం ఉంటుంది. సిల్వర్ కాంపౌండ్ వంటి లేపనాల వల్ల వెలుతురు పడితే వెలుగు నీడలుగా విడదీసి హత్తుకుంటుంది.
ఫిలిమ్ మీద ఉండే ఈ పూతను ‘లైట్ సెన్సిటివ్’ పదార్థాలంటారు. చక్కని దృశ్యం కాని, చెత్త సినిమా బొమ్మ కాని తీసిన తర్వాత ఈ ఫిలిమ్‌ను మరికొన్ని రసాయనాల్లో కడగడం వలన ‘డెవలపింగ్’, ‘ ఫిక్సింగ్’ పూర్తయి నెగెటివ్‌లో తెల్లని భాగాలు నల్లగా,నల్లనిఆకృతులు తెల్లగా ముద్రపడతాయి. దీని మీద నుంచి పడే కాంతి ఫోటో సెన్సిటివ్ లేపనాలు గల కాగితం మీద పడి వెలుగు నీడలు సక్రమంగా అవుతాయి. డెవలపింగ్, ఫిక్సింగ్, ప్రింటింగ్‌ లను ‘‘ప్రోసెసింగ్’’ అంటారు. అంటే ఆ ప్రక్రియలన్నీ పూర్తయితేనే ఫోటో పూర్తి ఆకారంతో సిద్ధం అవుతుందన్నమాట.
యుద్ధం పట్ల జాతీయ వాదుల వైఖరి
1914-18 మధ్య జరిగిన మొదటి ప్రపంచ యుద్ధంలో బ్రిటిష్ ప్రభుత్వానికి పూర్తిస్థాయిలో మద్దతు ఇచ్చారు భారత జాతీయవాదులు. భారతీయల పట్ల బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన విశ్వాసానికి కాంగ్రెస్ రాజకీయ సంస్కరణలు చేపట్టాలని కోరింది. తిలక్ జైలు నుంచి విడుదల కాగానే జాతీయ ఉద్యమానికి గొప్ప నాయకుడిగా ప్రశంసలను అందుకున్నాడు. జాతీయ వాద వర్గాలు తిలక్‌కు వీరోచిత స్వాగతం పలికాయి. తిలక్ కూడా ప్రభుత్వ కృషికి మద్దతునివ్వటానికి నిశ్చయించాడు.
‘‘ఇలాంటి క్లిష్ట సమయంలో పెద్ద-చిన్న, ధనిక-పేద అన్న తేడా లేకుండా ప్రతి భారతీయుడూ బ్రిటిష్ ప్రభుత్వానికి శక్తి కొలది మద్దతునిచ్చి సహాయం చెయ్యాలి’’ అని తిలక్ ప్రకటించాడు. సుహృద్భావంతో స్వరాజ్‌ను సాధించ వచ్చనుకున్న జాతీయవాదులు భారతీయులను సైనికదళంలో చేరవల్సిందిగా కోరారు. టర్కీ పట్ల బ్రిటిష్ ప్రభుత్వం వైఖరిని ముస్లిమ్‌లు నిరసించినా, ముస్లిం సైనికులు టర్కీ సైనికులతో మొసపొటేమియాలో వీరోచితంగా పోరాడారు.
తిలక్ ప్రతిష్ఠ తారాపథాన్నందుకుంది. ఆయన భారతేశం రాజకీయాలను చైతన్యవంతం చేశాడు. తిలక్ రాక, జాతీయాభిమానికి ఊపునిచ్చింది. కానీ అప్పటికి జాతీయ కాంగ్రెస్ మితవాదుల చేతుల్లో ఉంది.1914లో అనిబిసెంట్ భారత స్వాతంత్య్రోమానికి మద్దతు నిచ్చింది. మొదట్లో అనిబిసెంట్ కాంగ్రెస్‌ లోని రెండు వర్గాలను ఏకం చేయటానికి ప్రయత్నం చేసింది. కాని ఆమె కృషి విఫలమైంది.
చాలా మంది కాంగ్రెస్‌లో రెండు వర్గాల మధ్య సమైక్యతను సాధించటానికి ప్రయత్నించారు. చాలామంది కాంగ్రెస్ వాదులు తిలక్‌తో రాజీ ప్రయత్నాలు చేశారు. గోఖలే, ఫిరోజ్‌షా మెహతాలు మరణించడంతో మిత వాద వార్గానికి నాయకుడు లేకుండా పోయాడు. ఇదే సమయంలో తిలక్ లక్నో కాంగ్రెస్‌ని ప్రభావితం చేశాడు. అప్పటి నుంచి తిలక్ కాంగ్రెస్‌లో మకుటం లేని మహారాజు అయ్యాడు. కాంగ్రెస్ పునర్వికాసాన్ని పొందింది.
ప్లూటో... గ్రహం కాదా?
సౌరకుటుంబంలో మెర్క్యురీ (బుధుడు), వీనస్ (శుక్రుడు), భూమి (ఎర్త్), మార్స్ (అంగారకుడు), జూపిటర్ (గురుడు లేదా బృహస్పతి), సాటర్న్ (శని), యురేనస్, నెప్ట్యూన్, ప్లూటో అనే తొమ్మిది గ్రహాలు ఉంటాయని గతంలో చదువుకున్నాం. వాటిలో ప్లూటో అన్నింటికన్నా చిన్న గ్రహం. చాలా దూరంగా ఉంటుంది. 1930 ఫిబ్రవరి 18న ‘క్లైడ్ టైమ్ బా’ అనే ఖగోళ శాస్తజ్ఞ్రుడు ప్లూటోను కనుగొన్నాడు. 76 సంవత్సరాల పాటు ఇది గ్రహం హోదాలో ఉంది. కాని తర్వాత నుంచి ఫ్లూటోని గ్రహంగా గుర్తించట్లేదు.
2006లో జరిగిన అంతర్జాతీయ ఖగోళ సమాఖ్య సదస్సులో ప్లూటోను గ్రహాల జాబితా నుంచి తొలగించారు. ఇంటర్నేషనల్ ఆస్ట్రనామికల్ యూనియన్ వారు 2006 ఆగస్టు 24న గ్రహానికి ఒక నిర్వచనాన్ని రూపొందించారు. ప్లూటో ఆ నిర్వచనం పరిధిలోకి రాక పోవడంతో దానిని అప్పటి నుంచి డ్వార్ఫ్ ప్లానెట్ (మరుగుజ్జు గ్రహం) గా గుర్తిస్తున్నారు. సౌర వ్యవస్థలో ఏరిస్ తరవాత ప్లూటోనే అత్యంత పెద్ద డ్వార్ఫ్ ప్లానెట్ అని ఖగోళ శాస్తజ్ఞ్రులు ప్రకటించారు. ఫ్లూటో సూర్యునికి చాలా దూరంగా ఉండడమే కాకుండా అతి చల్లగా ఉంటుంది. దాని మీద ఉష్ణోగ్రత మైనస్ 235 నుంచి మైనస్ 210 డిగ్రీ సెల్సియస్‌ల వరకు ఉంటుంది.ప్లూటో మీద ఉండే వాతావరణంలో నైట్రోజన్, కొద్దిగా కార్బన్ మోనాక్సైడ్, మిథేన్ వాయువులు ఉన్నాయి.
 

కుషాణుల సామ్రాజ్యం
కుషాణుల పరిపాలన క్రీ.శ. 1వ శతాబ్దం నుంచి 3వ శతాబ్దం వరకు సాగింది. కుషాణులలో కనిష్కుడు గొప్పరాజుగా ప్రసిద్ధి చెందాడు. కుషాణుల పరిపాలన ప్రారంభమైన మొదటికాలంలో లభించిన కొన్ని చిహ్నాల పై పురాతన ఆలయాల బొమ్మలున్నాయి. వీటిలో వారు నిర్మించిన కోటలు, గురప్రుస్వారీ చేసిన వారి శిల్పా లున్నాయి. పుర్రె, అవిటితనం కలిగిన రాజు బొమ్మలు కూడా ఉన్నాయి. వీటికి అర్థం, కారణం తెలియక పోయినప్పటికీ ఎందుకు చిత్రించారా అన్న ఆసక్తిని రేకెత్తించేటట్లు ఉన్నాయి. కుషాణులు చైనాలోని గిరిజన తెగలకు చెందిన వారు. ఆ తెగల్లో పరస్పరం ఆధిపత్య పోరు కొనసాగుతూ ఉండేది.వీరు చైనాలోని గన్సూ ప్రాంతంలో నివసించేవారు. వీరు మాట్లాడేది తొచారియన్ భాష కావచ్చని చరిత్రకారుల అభిప్రాయం. పరస్పర దాడుల కారణంగా ఈ చైనా గిరిజన జాతులు తలా ఒక వైపుకు విస్తరించారు. జొయాగ్ను దాడుల వలన ఈ జాతుల వారు మరింత పడమర దిక్కుకు వె ళ్లి ఉంటారని భావిస్తున్నారు.
అప్పటి సామాజిక, ఆర్థిక పరిస్థితులలో ప్రజలు ఇతర ప్రాంతాల్లో స్థిర పడ్డారు. అందులో భాగంగానే కుషాణులు మన దేశంలోకి వచ్చి ఉంటారని జాన్‌కీయ్ అనే చరిత్రకారుడు భావించాడు. సుమారు క్రీ.శ. 250 నాటికి కుషాణుల సామ్రాజ్యం ప్రస్తుత తజికిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్, పాకిస్థాన్ ప్రాంతాల నుంచి భారతదేశంలోని గంగానది పరీవాహక ప్రాంతమంతా విస్తరించింది. కుషాణులకు రోమన్ సామ్రాజ్యంతోనూ, పర్షియా, చైనాలతోనూ రాజకీయ సంబంధాలు ఉండేవి. తూర్పు, పశ్చిమ భూముల మధ్య సాంస్కృతిక, ఆర్థిక, రాజకీయ మేళవింపులకు కుషాన్ సామ్రాజ్యం ఒక ముఖ్యమైన కేంద్రం అయింది. కుషాణుల్లో చివరిరాజు మొదటి వాసుదేవుడు. ఇతడు క్రీ.శ. 225లో మరణించాడు. ఆ తర్వాత కుషాణుల రాజ్యం విచ్ఛిన్నమైంది.

భూమి కూడా అంతరిస్తుందా?
యుద్ధ అణ్వస్త్ర ప్రయోగాల వలన, పర్యావరణ నిర్లక్ష్యం వలన, నీరు, చెట్లు లేకపోవటం వలన కూడా భూమి మీద మానవాళి నశించే అవకాశం లేకపోలేదు. అయితే సహజంగా భూమి ఎప్పుడు, ఎలా అంతరిస్తుంది?
సౌరకుటుంబంలోని గ్రహాలన్నీ సూర్యుడి మీద ఆధారపడి నడుస్తుంటాయి. మరి సూర్యుడిలో అంత మంట ఎక్కడిది? ైెహడ్రోజన్ గ్యాస్ హీలియంగా మారుతూ విపరీతమైన వేడిమి, మంటలు, వెలుగు, శక్తి అపరిమితంగా విడుదలవుతుంటాయి. కొంతకాలానికి హైడ్రోజన్ అయిపోతే... అంటే ఇంధనం అయిపోతే సూర్యుడు బద్దలవుతాడు. ఆ ప్రభావానికి భూమి, సమీప గ్రహాలు బద్దలై ధ్వంసమైపోతాయి. అయితే ఈ పరిమాణం 5000 మిలియన్ సంవత్సరాల తరువాత జరగవచ్చని భావిస్తున్నారు.

అంతరిక్షంలో ఎలా నడుస్తారు?
రాకెట్ అంతరిక్షంలోకి చేరిన తరువాత వ్యోమగాములు రాకెట్ బయటకు వచ్చి అంతరిక్షంలో దాదాపు నిరాధారంగా నడిచారు. అంతరిక్షంలో గాలితో సహా ఏమీ ఉండని భారరహిత స్థితి మాత్రం ఉంటుంది.
నేల మీద నడిచినట్టు అంతరిక్షంలో నడవలేరు. పోనీ ఒక పద్ధతిగా కావలసిన వైపు నడవడానికి వీలయ్యే ఆకర్షణ స్థితి కూడా ఉండదు. రాకెట్ మాడ్యుల్ కదిలినట్టే తేలిపోతూ కదలవలసిందే! రాకెట్ నుంచి బయటకు వచ్చే ముందు రాకెట్ ఇంజన్‌కు ఎక్కువ ఒత్తిడి కలిగే ఇంధనాన్ని పంపిస్తారు. దాని ద్వారా రాకెట్‌లో నుంచి వ్యర్థ పదార్థాలను బయటకు నెట్టివేసే మార్గంలో ఒకరకమైన ఒత్తిడి పనిచేస్తుంది. ఇక్కడ కూడా అటు వంటి ఒత్తిడే పని చేస్తుంది. అప్పుడు వ్యోమగాములు రాకెట్‌కు వ్యతిరేక దిశలో నడవగలుగుతారు.
సాంఘిక, సాంస్కృతిక విధానాలు... ఈస్టిండియా కంపెనీ
1813 సం. వరకు బ్రిటిష్ వారు భారతీయ మత, సాంఘిక, సాంస్కృతిక జీవన విధానంలో జోక్యం చేసుకోలేదు. బ్రిటిష్ కంపెనీ పాలకులుగా వచ్చిన కొంతమంది విశాల దృక్ఫథంతో భారతీయ ప్రత్యేకతను, నాగరికత, సంస్కృతి ని పరిరక్షించటం అవసరమని భావించారు. పాశ్చాత్య భావాలకు అనుగుణం గా భారతీయులను మార్చకూడదని వారు భావించారు. అయితే విప్లవాత్మ కమైన మార్పులు, ఆధునీకరణ కార్యక్రమాలు ప్రజల్లో వ్యతిరేకతను రేకెత్తించవని వారు అభిప్రాయపడ్డారు.
కానీ పారిశ్రామిక విప్లవం, ఆధునిక పెట్టుబడిదారీ విధానం ప్రారంభమైన తర్వాత ఇంగ్లండ్‌లో కూడా కొత్త ఆలోచనలు వచ్చాయి. సత్యాన్వేషణ, శాస్త్ర విజ్ఞానం తోటి మానవుల పట్ల సానుభూతి మొదలైనవి. ఈ పద్ధతులకు మద్దతునిచ్చిన తీవ్రవాదులు... ఆచరణలో ఉన్న వర్ణ వ్యవస్థ, అంట  రానితనం, స్ర్తీలు తక్కువ వారనే భావన మొదలైన సాంఘిక దురాచారాలతో రాజీపడ పడలేదు.
భారతదేశ సాంఘిక జీవనం అటువంటి దురాచారాలను అరికట్టి, ఆధునీకరణ చెందాలని వారు బలంగా భావించారు. క్రైస్తవ మత ప్రచారానికి వచ్చిన మత ప్రచారకులు కూడా అటువంటి ఆధునీకరణ కార్యక్రమాలను కొనసాగించారు.
హిందూ దేశానికి, పాశ్చాత్య దేశాలతో సంబంధాలు ఏర్పడింది. నాటికి ఐరోపాలో మార్టిన్ లూథర్‌కింగ్, బేకన్ హ్యూమ్ హాబ్స్, బెంథామ్, టామ్‌పైన్ మొదలై న అనేక మంది సంస్కర్తల ప్రభావానికి భారత సమాజం లోనైంది. ఫ్రెంచి విప్లవ ప్రధాన ఉద్దేశాలు అయిన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం తో ప్రభావితమైన కాలమది. విద్యావంతులైన భారతీయు లందరూ ఈ కొత్త ఆశయాలకు, భావాలకు ప్రభావితులయ్యారు. వీరు కొద్దిమందే అయిన ప్పటికీ దేశంలో సాంఘిక, రాజకీయ, మత సంస్కరణ ఉద్యమాలను కొనసాగించారు.
రాక్షసి తంగడి యుద్ధం
 విజయనగర సామ్రాజ్యానికి, దక్కను సుల్తానుల కూటమికి మధ్య జరిగిన యుద్ధమే తళ్లికోట లేదా రాక్షసి తంగడి యుద్ధం. ఇది 1565 జనవరి 26న జరిగింది. చరిత్ర గతిని మార్చిన యుద్ధాల్లో ఇది ఒకటి. ఇది దక్షిణ భారతదేశంలో చివరి హిందూ సామ్రాజ్యమైన విజయనగర సామ్రాజ్య పతనానికి దారితీసిందని చెప్పవచ్చు. శ్రీకృష్టదేవరాయల కాలంలో ఉచ్చస్థితికి చేరుకున్న విజయనగర సామ్రాజ్య శకం చివరివాడైన రామరాయలు మరణంతో ముగిసిందని చెప్పవచ్చు.

ఈ యుద్ధానికి దారి తీసిన పరిస్థితులు ఒక్కసారి ఉత్పన్నమైనవి కావు. సుల్తానులకు, విజయనగర రాజులకు మధ్య దశాబ్దాలుగా వైరం ఉంది. అనేక యుద్ధాలు జరిగేవి. ముఖ్యంగా సంపదతో తులతూగుతుండే కృష్ణ్ణ, తుంగభద్ర నదుల మధ్య ఉన్న రాయచూరు, అంతర్వేది ప్రాంతం వీరి వైరానికి కేంద్రంగా ఉండేది. 1509 వరకు విజయనగరం మీద లభించిన విజయం... సుల్తానులకు అందని పండే అయింది.

అందుచేత విజయనగరాన్ని ఓడించాలనే పట్టుదల వారిలో ఉండేది. శ్రీకృష్ణదేవరాయలు 1520 మే 19న బీజాపూర్ సుల్తాను ఇస్మాయిల్ ఆదిల్‌షాను చిత్తుగా ఓడించి రాయచూరును స్వాధీనం చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో సుల్తానులు, ముస్లిం రాజులు సంధి కుదుర్చుకున్నారు. రాయలు తీసుకున్న ప్రాంతాల్ని తిరిగి ఇమ్మని ఆదిల్‌షా రాయలకి రాయబారం పంపాడు. ఆయన తిరస్కరించటంతో ఈ యుద్ధం జరిగిందని చెప్తారు. ఈయుద్ధం గురించి భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.


కండరాల నొప్పి ఎందుకు వస్తుంది?
శరీరం ఆరోగ్యంగా ఉండడానికి వ్యాయామం అవసరం. కానీ అతిగా చేస్తే మాత్రం ఇబ్బందే. ఎక్కువ శ్రమపడి పనిచేసినా, వ్యాయామం ఎక్కువైనా ఒళ్లంతా నొప్పులుగా ఉంటుంది. కారణం కండరాల్లో నొప్పి. మనం ఏ పని చేసినా కండరాలు కదులుతాయి. ఎక్కువ పని చేస్తే కండరాలు ఎక్కువగా అలసిపోయి నీరసిస్తాయి.
అప్పుడు విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. కాని విశ్రాంతి తీసుకోకుండా పనిచేస్తే కండరాలలో బాధ మొదలవుతుంది. అంటే నడుము లాగడం, కాళ్లు పీకడం లాంటివి. అయితే కండరాలు శ్రమించినపుడు వాటిల్లో లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుందని, దాని వలనే నొప్పులు వస్తాయని భావించేవారు. కానీ అలసిపోయిన కండరాల పరిస్థితి మెరుగు పడేటందుకే లాక్టిక్ ఆమ్లం ఉత్పత్తి అవుతుందని ఆ తర్వాత జరిగిన పరిశోధనల్లో తెలిసిందట. కండరాల్లో ఉన్న గ్లైకోజన్ నిల్వలను వాడేయడం వలనే కండరాల నొప్పులు వస్తాయని భావిస్తున్నారు. ఏదేమైనా బాగా అలసిపోయినపుడు సరైన విశ్రాంతి తీసుకుంటే కండరాల నొప్పులు చాలావరకు తగ్గిపోతాయనేది వాస్తవం.
ఆత్మగౌరవ ఉద్యమం
తమిళనాడు ప్రాంతంలో అణగారిన సామాజిక వర్గాల అభ్యుదయానికి కృషి చేసిన వ్యక్తి రామస్వామి నాయకర్. ఆయన అక్కడ ఆత్మగౌరవ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆయన అగ్రవర్గాల ఆధిక్యతను వ్యతిరేకించాడు. ఇతర సామాజిక వర్గాలు కూడా వారి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవాలని ప్రబోధించాడు.
రామస్వామి నాయకర్ 1879 సెప్టెంబర్ 17న ఈరోడ్‌లో జన్మించాడు. ఆయన అస్పృశ్యతను, సాంఘిక అసమానతలను తీవ్రంగా ఖండించాడు. యుక్తవయసులో మత గ్రంథాలను అధ్యయనం చేస్తూ పండితులతో చర్చలు జరిపేవాడు. హేతువాద దృక్పథాన్ని అలవర్చుకొని నాస్తికుడు అయ్యాడు.
రామస్వామి నాయకర్ ఈరోడ్ పురపాలక సంఘానికి కొంతకాలం అధ్యక్షుడుగా ఉన్నాడు. భారత జాతీయ కాంగ్రెస్ కమిటీకి అధ్యక్షుడయ్యాడు. అస్పృశ్యులపై విధించిన నిర్బంధాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నిర్వహించాడు. ఆ క్రమంలో ఆయన పేరుమోసిన ప్రజా నాయకుడు కావడమే కాక ఉద్యమాలు లేవదీస్తున్నాడన్న ఆరోపణ మీద జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. రామస్వామి జైల్లో ఉండగా ఆయన భార్య నాగమ్మాళ్ స్ర్తీ విముక్తి ఉద్యమాలను నిర్వహించింది.
ఆయన బలహీన సామాజిక వర్గాలకు... ఉద్యోగాలలో, శాసనసభ స్థానాల్లో ప్రత్యేకంగా కేటాయింపు ఉండాలని కోరారు. కాంగ్రెస్‌లో అగ్రవర్ణాలదే పైచేయి అని రామస్వామి భావించినా, ఆ దృక్పథం పట్ల అసంతృప్తి చెందాడు. కాంగ్రెస్‌ను అగ్రవర్ణాల కంచుకోటగా వర్ణించి, కాంగ్రెస్ నుంచి బయటకు వ చ్చాడు.
1936లో మదురలో ఇతర సామాజిక వర్గాల సమావేశం జరిగింది. అగ్రవర్ణాల ఆధిపత్యాన్ని వ్యతిరేకించాలని, పతనావస్థలో ఉన్న జస్టిస్ పార్టీని పైకి తీసుకు రావాలని నిర్ణయం తీసుకోవడంలో రామస్వామి పాత్ర కీలకం. ఆత్మగౌరవ ఉద్యమం, జస్ట్టిస్ పార్టీ పరస్పరం సహాయం చేసుకున్నాయి. రామస్వామి నాయకర్ జస్టిస్ పార్టీకి గొప్ప నాయకుడు అయ్యాడు.







ఆంగ్లసాహిత్యంలో విలియం షేక్‌స్పియర్‌ది ఉన్నతస్థానం. ఆయన ఇంగ్లండ్‌లోని వార్విక్‌షైర్‌లోని స్ట్రాట్‌ఫోర్డ్-ఎవాన్‌లో జన్మించాడు. షేక్‌స్పియర్ తల్లిదండ్రులు మేరీ, జాన్ షేక్‌స్పియర్. స్థానికంగా ఉండే గ్రామర్ స్కూల్లో షేక్‌స్పియర్ కొంతకాలం విద్యాభ్యాసం చేశాడు. 1582లో ఆన్నె హాత్‌వేతో షేక్‌స్పియర్ వివాహం జరిగింది.

బతుకుతెరువు కోసం లండన్ చేరుకుని నాటకాలు వేసే కంపెనీలో చేరి చిన్నచిన్న పనులు చేస్తూ, నటిస్తూ పెద్ద రచయిత స్థాయికి ఎదిగాడు. ఆయన రాసిన హామ్లెట్, కింగ్‌లియర్, మాక్‌బెత్, ఒథెల్లో నాటకాలు ‘ఫోర్ గ్రేట్ ట్రాజెడీస్’ గా ప్రపంచ ప్రసిద్ధిచెందాయి. రోమియో జూలియెట్, ట్వెల్త్ నైట్, మిడ్ సమ్మర్ నైట్స్ డ్రీమ్, జూలియస్ సీజర్, మర్చంట్ ఆఫ్ వెనిస్ లాంటి నాటకాలను సాహిత్యాభిమానులు చదువుతూనే ఉంటారు. షేక్‌స్పియర్ మొత్తం 37 నాటకాలు, అనేక